మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ క్లారిటీ.. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదన్న సీఎం
న్యూఢిల్లీ: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం లేదని, పార్టీ అధిష్ఠానం కూడా ఇప్పట్లో ఆ దిశగా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రివర్గంలో చోటు కోసం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కలవడం సహజమేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి ఎమ్మెల్యేకీ మంత్రి అయ్యే అర్హత ఉందని పేర్కొంటూ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రుల సంఖ్యకు పరిమితులు ఉన్నాయని వివరించారు. అందువల్ల అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదని చెప్పారు.
ఇటీవల మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలు, రాజకీయ చర్చల నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పరిపాలనపై అధిష్ఠానం తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టుల అమలుపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీలో పలువురు జాతీయ నాయకులను కలిసినట్లు సమాచారం.
