వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష.. నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలకు హెచ్చరిక
హైదరాబాద్: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన వర్షాకాల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.
ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలు, శాఖల మధ్య సమన్వయ లోపాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్, వాటర్బోర్డ్, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. వర్షాల సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు విత్తనాలు, యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి కాలుష్యాన్ని నివారించడం, అంటువ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణ, విపత్తు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
