మెట్రో రుణం నిలిచిపోవడానికి రేవంత్ సర్కారే కారణం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన రుణం నిలిచిపోవడానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ఫేజ్-2 విస్తరణకు తాను అడ్డంకులు సృష్టిస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, మెట్రో ద్వారా వచ్చే టికెట్ ఆదాయం, ప్రకటనల ఆదాయాన్ని ముందుగా నిర్వహణ (O&M) ఖర్చులకు వినియోగించాలని కేంద్రం సూచించిందన్నారు. అయితే ఆ ఆదాయాన్ని నేరుగా రుణాల చెల్లింపులకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతోనే రుణ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడిందని తెలిపారు.
దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో కూడా నిర్వహణ ఖర్చులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే రుణాల చెల్లింపులు జరుగుతాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
మెట్రో రుణ అంశాన్ని రాజకీయ విమర్శలతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని స్పష్టం చేశారు.
ఇటీవల మెట్రో రుణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
