ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బతికుండగానే ‘చంపేశారు’.. భూమి కాజేశారు!

బతికుండగానే ‘చంపేశారు’.. భూమి కాజేశారు!

బతికుండగానే ‘చంపేశారు’.. భూమి కాజేశారు!

 -రెవెన్యూ అధికారుల అండతో ఘరానా మోసం

-తప్పుడు డెత్ సర్టిఫికేట్‌తో వృద్ధుడి భూమి మ్యుటేషన్

-ప్రజావాణి’లో కలెక్టర్‌కు బాధితుడి ఆవేదన

కొండపాక, జూన్ 17 ( ఆశ్వి అప్డేట్స్ )

కళ్ల ముందే మనిషి తిరుగుతున్నాడు.. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆయన చనిపోయాడు! వినడానికి విడ్డూరంగా, తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉన్నా.. రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు కేటుగాళ్లు చేసిన ఘరానా మోసమిది. కేవలం కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేయడం కోసం బతికున్న వృద్ధుడిని కాస్తా చనిపోయినట్లు చూపిస్తూ, తప్పుడు డెత్ సర్టిఫికేట్‌తో పట్టా మార్చేసుకున్నారు. బాధితుడు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ వేదికగా కలెక్టర్  హైమావతిని కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో ఈ షాకింగ్ ఉదంతం వెలుగుచూసింది.

-40 ఏళ్ల క్రితం వలస.. అన్నకు కౌలుకు భూమి

వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన దండుగుల మల్లయ్య, దండుగుల గురువయ్య, దండుగుల కనకయ్య, దండుగుల చిన్న మల్లయ్యలు అన్నదమ్ములు. వీరిలో నాలుగో వాడైన దండుగుల చిన్న మల్లయ్య ఉపాధి నిమిత్తం దాదాపు 40 సంవత్సరాల క్రితమే పెద్ద గుండవెల్లి గ్రామానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అయితే, తన సొంత గ్రామమైన బందారంలో అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తితో పాటు చిన్న మల్లయ్యకు కూడా 1 ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకునేందుకు గానూ తన అన్న అయిన కనకయ్యకు చిన్న మల్లయ్య కౌలుకు ఇచ్చాడు. అప్పటినుంచి ఆ భూమి కనకయ్య ఆధీనంలోనే సాగు అవుతోంది.

-మరొకరి డెత్ సర్టిఫికేట్‌తో ‘పౌతి’ మాయాజాలం..

ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 2023లో వీరి పెద్దన్న కుమారుడు (దండుగుల మల్లయ్య) మరణించాడు. అయితే, ఇదే అదనుగా భావించిన సదరు మల్లయ్య భార్య భూమిని కాజేయడానికి ఒక దురాలోచన చేసింది. వరుసకు మామ అయిన ‘చిన్న మల్లయ్య’ బతికే ఉన్నప్పటికీ.. తన భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని  అడ్డుపెట్టుకుని రెవెన్యూ రికార్డుల్లో మాయాజాలం సృష్టించింది.స్థానిక కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో చిన్న మల్లయ్యకు చెందిన 1 ఎకరం 10 గుంటల భూమిని, చనిపోయిన తన భర్త భూమిగా రికార్డుల్లో చూపించింది. అనంతరం ఆ భూమిని తన పేరిట ‘పౌతి’ (విరాసత్/వారసత్వ మార్పిడి) చేయించుకుని మ్యుటేషన్ కూడా పూర్తి చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

-సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి

ఇటీవల తన భూమి వేరొకరి పేరిట మారినట్లు తెలుసుకున్న వృద్ధుడు చిన్న మల్లయ్య దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను ప్రాణాలతో ఉండగానే, చనిపోయినట్లు రికార్డులు సృష్టించి భూమిని ఎలా బదలాయిస్తారని కన్నీరుమున్నీరయ్యాడు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి స్వయంగా హాజరై, కలెక్టర్ కె. హైమావతికి ఫిర్యాదు పత్రాన్ని అందించాడు.

“నేను బతికే ఉన్నా సార్.. కానీ నన్ను చంపేసి నా భూమి లాక్కున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. మీరే నాకు న్యాయం చేయాలి అని బాధితుడు కలెక్టర్ ముందు తన ఆవేదనను వెళ్లబోసుకున్నాడు.ఈ ఘోరంపై స్పందించిన కలెక్టర్ హైమావతి.. విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని, బాధితుడికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి భూమి కాజేసిన ఈ ఉదంతం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!