ఎస్బీఐ ఖాతాలపై తెలంగాణ సర్కార్ ఆరా.. అన్ని శాఖల నుంచి వివరాల సేకరణ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఎన్ని ఖాతాలు ఉన్నాయనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఖాతాల్లో ఎంత మేర డిపాజిట్లు ఉన్నాయో వివరాలు పంపాలని ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్‌బీఐలో కొత్తగా డిపాజిట్లు చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని కూడా సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
ఇటీవల రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూమి వేలం అంశంపై ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎస్‌బీఐతో ఉన్న ఆర్థిక లావాదేవీలను సమీక్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ డిపాజిట్లను ఇతర బ్యాంకులకు మళ్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఎస్‌బీఐ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి భూమి వివాదానికి సంబంధించిన తమ వాదనను వివరించినట్లు తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించకపోయినా, ఎస్‌బీఐలో ఉన్న ప్రభుత్వ నిధులు, ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించడం రాష్ట్ర ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
