నేటి నుంచి పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. ప్రజాదర్బార్‌కు ప్రత్యేక ప్రాధాన్యం
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సోమవారం పులివెందులకు చేరుకునే జగన్, భాకరాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి పులివెందులలోనే బస చేయనున్నారు.
జూన్ 24న వేముల మండలం భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి పులివెందులకు చేరుకుని మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
పర్యటనలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలు, పార్టీ కార్యకలాపాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై జగన్ సమీక్ష చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 25న పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.
