మొహర్రం త్యాగం, ధర్మానికి ప్రతీక.. కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొహర్రం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, సత్యం, త్యాగానికి ప్రతీకగా మొహర్రంను అభివర్ణిస్తూ, ఈ పండుగ సమాజంలో సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు కుల, మతాలకు అతీతంగా జరుపుకునే పీర్ల పండుగ గంగా–జమునీ తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. హజ్రత్ ఇమామ్ హసన్, హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే ఈ వేడుకలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లౌకికవాదానికి పెద్దపీట వేస్తూ మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో సమాజంలో శాంతి, సామరస్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మైనారిటీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.
