ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల వాయిదా.. జూలై 2న ప్రకటించనున్న అధికారులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET-2026) ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. ముందుగా విడుదల చేయాలని భావించిన ఫలితాలను ఇప్పుడు జూలై 2 (గురువారం) విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అధికారుల వివరాల ప్రకారం, సీబీఎస్ఈ 12వ తరగతి సవరణ ఫలితాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, అలాగే ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులు కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫలితాలు విడుదలైన అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి స్కోర్‌కార్డు, ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఏపీఎస్సీహెచ్ఈ ప్రత్యేకంగా ప్రకటించనుంది.
