ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారా?.. నిర్ణయంపై కార్మిక సంఘాల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల నిర్వహణను 10 నుంచి 15 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించేలా యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం వెలువడింది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సమాచారం ప్రకారం, ప్రస్తుతం కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి ఏటా రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, కొత్త ఒప్పందం ప్రకారం ప్రైవేట్ సంస్థ నెలకు సుమారు రూ.3 కోట్ల చొప్పున చెల్లించి కార్గో కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల సంస్థ ఆదాయంపై ప్రభావం పడే అవకాశముందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్గో సేవల ప్రైవేటీకరణతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న లైసెన్స్ హమాలీలు, కార్గో విభాగానికి చెందిన సిబ్బంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ప్రస్తుతం సేవలు నిర్వహిస్తున్న కొందరు ఏజెంట్లు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
మరోవైపు, ఆర్టీసీ వర్గాలు మాత్రం సేవల నిర్వహణలో పరిపాలనా భారం తగ్గించడం, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నాయి. ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
