ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నిస్తాం.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేటీఆర్ సవాల్

ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నిస్తాం.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేటీఆర్ సవాల్

ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నిస్తాం.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేటీఆర్ సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర అప్పులు, ఎన్నికల హామీల అమలు సహా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వాన్ని వెంటాడుతామని పేర్కొంటూ, అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు.

రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులు, వాటితో చేపట్టిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పాలనలో తీసుకున్న రుణాలపై అధికారిక లెక్కలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యముంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, ప్రతిపక్షానికి పూర్తి సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగ సంక్షోభం, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు, విద్యార్థుల సమస్యలు సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. సభలో మైక్ కట్ చేయకుండా కనీసం రెండు గంటల సమయం ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల ముందుంచుతామని చెప్పారు.

అలాగే బహిరంగ చర్చలకు సవాళ్లు విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు వెనక్కి తగ్గారని కేటీఆర్ విమర్శించారు. చర్చకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు.

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తామని, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెడతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!