రక్తసిక్తమైన జాతీయ రహదారి 65…
-మితిమీరిన వేగం.. ఎగిరి అవతలి రోడ్డుపై పడ్డ కారు
-హైవేపై క్షణకాలంలో విలయతాండవం నాలుగు వాహనాలు ధ్వంసం
జహీరాబాద్ ఆగస్టు 11 అశ్వి అప్డేట్స్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. క్షణకాలంలో సంభవించిన ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు
స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కు కారు గాలిలోకి లేచి, ఎగిరి అవతలి ట్రాక్‌పై పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలను వరుసగా ఢీకొట్టడంతో మృత్యువు విలయతాండవం చేసింది. ప్రమాద ధాటికి వాహనాల భాగాలు తునాతునకలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
దారుణ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వాహనాల్లో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
సమాచారం అందుకున్న కోహీర్ ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను తక్షణమే అత్యవసర చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ వల్ల వాహనాలు ఎక్కడకక్కడే నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
