ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆరు డీఏలు పెండింగ్.. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువుభత్యం (డీఏ) బకాయిలు పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన తాజా డీఏను కలుపుకుంటే మొత్తం ఆరు డీఏలు పెండింగ్లోకి వెళ్లనున్నాయని పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా డీఏల విడుదలలో జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు డీఏలు మాత్రమే విడుదల చేయగా, మరో ఆరు డీఏలు ఇంకా బకాయిగా ఉన్నాయని వారు చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డీఏలు సుమారు 15 శాతం వరకు చేరుకున్నాయి. వీటిని, వాటి బకాయిలను చెల్లించాలంటే ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు ఇంకా చెల్లించలేదని కూడా సంఘాలు గుర్తు చేస్తున్నాయి.
పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
