ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ భాస్కరరెడ్డి, అనిల్కుమార్లను ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది.
ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక కోర్టు నిందితులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు, టెండర్ల వివరాలను సేకరించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. అలాగే ప్రభుత్వానికి సుమారు రూ.196.33 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది.
మద్యం రవాణా విధానం, టెండర్ల కేటాయింపు, నిధుల లావాదేవీలపై మరింత లోతైన విచారణ అవసరమని ఈడీ వాదించింది. నిందితులను కస్టడీలో విచారించడం ద్వారా కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని కోర్టుకు వివరించింది.
అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కస్టడీ పిటిషన్పై కోర్టు తీసుకునే నిర్ణయం దర్యాప్తులో కీలకంగా మారనుంది.
