తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధులు.. గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్

అక్బర్‌పేట భూంపల్లి, జూన్ 29 (ఆశ్వి అప్డేట్స్): గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అక్బర్‌పేట భూంపల్లి ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలంలో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల 25 లక్షల నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు.
గత ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలనా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ సహకారంతో తహసీల్దార్ కార్యాలయానికి నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా డీసీసీ కార్యదర్శి ఏలూరి కమలాకర్, బేగంపేట సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు సుమలత, మాధురి, బాల గౌడ్, మధు, జగన్, ప్రతాప్, కుమార్, శ్రీనివాస్ గౌడ్, బాల్తే వెంకటేశం, గుండా శంకర్, బాలు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
