తూప్రాన్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వాలు
-పదవికి, పార్టీకి తూప్రాన్ పిఏసిఎస్ ఛైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి రాజీనామా
-మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్ర ఆరోపణలు
-రైతుల ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం
-గజ్వేల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అంతర్గత విభేదాలు
తూప్రాన్, జూన్ 01, (ఆశ్వి అప్డేట్స్)
గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్టుల అమ్మకాలు, కొనుగోళ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని తూప్రాన్ పిఏసిఎస్ అధ్యక్షులు మెట్టు బాలకృష్ణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా, పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే తూప్రాన్ ఉమ్మడి మండలాల పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి తన ఛైర్మన్ పదవికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిఎసిఎస్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే నేను పార్టీలో చేరాను. కానీ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు నన్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి అంటూ విమర్శించారు.ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం మరియు అధికారులు అనుసరిస్తున్న మొండి వైఖరికి విసుగు చెండే తాను పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ రైతులను రోడ్డుపాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని విమర్శించారు.
*త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ*
నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో, తమ తదుపరి రాజకీయ అడుగులపై బాలకృష్ణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలు, సూచనల మేరకే తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.ముఖ్యనేతల రాజీనామాలు, మాజీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలతో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దీనిపై అధిష్టానం మరియు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కార్యక్రమంలో నాగులపల్లి మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, రంగాయ పల్లి మాజీ ఉపసర్పంచ్ నవీన్,చెట్ల గౌరారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్, గుండ్రెడ్డిపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ పట్లూరి శేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు సుధాకర్ రెడ్డి కొండాపురం లక్ష్మారెడ్డి, దండుపల్లి మహేష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
