రూ.10 లక్షలకు రూ.40 లక్షలంటూ మోసం.. ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్ సహా 12 మంది అరెస్ట్
సత్తుపల్లి: బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి నాలుగు రెట్లు నగదు ఇస్తామంటూ ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఓ ఆర్‌ఎస్సై, బెటాలియన్ కానిస్టేబుల్ సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ముఠా సభ్యులు వివిధ పేర్లతో ఫోన్ చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని పరిచయం చేసుకునేవారు. తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఆదాయపు పన్ను సమస్యల కారణంగా దానిని వైట్ మనీగా మార్చాల్సి ఉందని చెప్పి బాధితులను నమ్మించేవారు. రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు తిరిగి ఇస్తామని ఆశ చూపేవారని పోలీసులు తెలిపారు.
బాధితులు డబ్బుతో వచ్చిన తర్వాత ముఠా సభ్యులు డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీ నోట్లతో కూడిన బ్యాగును చూపించేవారు. అసలు నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసుల వేషంలో మరికొందరు అక్కడికి చేరుకుని, దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారంటూ బెదిరించి నగదును ఎత్తుకెళ్లేవారని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా జంగారం ప్రాంతంలో జరుగుతున్న డీల్‌పై దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో బెటాలియన్ కానిస్టేబుల్ వర్ధన్, ఆర్‌ఎస్సై కేశవరావు సహా వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, ఒక స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫామ్, సంకెళ్లు, రూ.500 డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీకి చెందిన 80 బండిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
