తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం
అభివృద్ధి కాదు… రాజకీయ కక్ష సాధింపే చైర్మన్ భర్తపై మండిపాటు
స్ట్రీట్ లైట్లు తొలగింపు, డ్రైనేజీ పనుల నిర్లక్ష్యం పై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు
తూప్రాన్ మే 23( అశ్వి అప్డేట్స్ )
మెదక్జి జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో అభివృద్ధి పనులను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటూ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొక్కొండ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వార్డులో పరిస్థితుల్లో అధ్వానంగా మారడంతో మున్సిపల్ కార్యాలయ ముట్టడికి సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ గెలిచిన సమయంలోనే 12వ వార్డును అభివృద్ధి పరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ తన కుటుంబ సభ్యురాలిని బరిలోకి దింపినా, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి రామునిగారి స్వప్న నాగరాజు గౌడ్‌కు మద్దతు ఇచ్చి గెలిపించారని తెలిపారు. అప్పటి నుంచే వార్డుపై కక్ష పెంచుకున్న చైర్మన్ భర్త, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.ప్రత్యేకంగా కేవీఆర్ కాలనీ సహా పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలపై ఉన్న స్ట్రీట్ లైట్లు తొలగించడం ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుందన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారనే కారణంతో కాలనీలను అంధకారంలో ముంచడం ప్రజాస్వామ్యానికి మచ్చ విమర్శించారు.ఇప్పటి వరకు సైడ్ డ్రైనేజీలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకుండా కాలనీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వర్షాకాలం సమీపిస్తున్నా మురుగు నీటి సమస్యలపై స్పందించకపోవడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని అన్నారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ,ప్రజల ఓటు హక్కును గౌరవించకుండా ఓడిపోయిన కోపంతో అభివృద్ధిని అడ్డుకోవడం తగదు. మున్సిపాలిటీ ప్రజలది… ఏ పార్టీ సొత్తు కాదు. 12వ వార్డుపై వివక్ష కొనసాగితే భారీ ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.మరోవైపు వార్డు ప్రజలు కూడా చైర్మన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, “పన్నులు మాత్రం వసూలు చేస్తారు… కానీ కనీస సౌకర్యాలు ఇవ్వరు. రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చైర్మన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనలు చేపట్టి, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని 12వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.తూప్రాన్ ల్లో ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణలతో మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
