కన్నప్రేమ కరిగిపోయింది… ఆస్తి గొడవల్లో మానవత్వం మట్టికొట్టుకుపోయింది
-భూ తగాదాల కోసం తల్లి శవాన్ని లాక్కెళ్లిన పెద్ద కుమారుడు…
-కన్నతల్లి అంత్యక్రియలు చేయలేక కోడిని పూడ్చిపెట్టిన చిన్న కొడుకు దీనస్థితి
చిన్నశంకరంపేట, మే 24 (ఆశ్వి అప్డేట్స్)
నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, రెక్కల ముక్కలు చేసుకుని పెంచిన కన్నతల్లి మరణిస్తే… ఆ తల్లి పార్థివ దేహం సాక్షిగా ఆస్తి పంచాయితీలు పెట్టుకున్నారు ఆ కుమారులు. ‘ఆస్తి తేల్చేవరకు అంత్యక్రియలు జరగనివ్వం’ అంటూ ఒకరు మొండికేస్తే, కడసారి చూపుకు కూడా నోచుకోలేక, తల్లికి అగ్గిపెట్టే భాగ్యం లేక శ్మశానంలో కోడిని పూడ్చిపెట్టి కన్నీరుమున్నీరయ్యాడు మరొకరు. ఆస్తి వ్యామోహంలో మానవసంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో అద్దం పట్టే హృదయవిదారక ఘటన చిన్నశంకరంపేట మండలంలో వెలుగుచూసింది.
శవం వద్దే ఆస్తుల పంచాయితీ
మండల పరిధిలోని బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి చంద్రమ్మకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు సొంత గ్రామంలోనే ఉంటుండగా, చిన్న కుమారుడు గోపాల్ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చంద్రమ్మ, శుక్రవారం చిన్నకుమారుడి ఇంట్లోనే కన్నుమూశారు.తల్లి మరణవార్త తెలిసిన పెద్ద కుమారుడు నాగరాజు అక్కడికి చేరుకున్నాడు. అయితే, అన్నదమ్ముల మధ్య గత రెండేళ్లుగా భూమి పంపకాల గొడవలు నడుస్తున్నాయి. కనీసం తల్లి చనిపోయిందన్న బాధ కూడా లేకుండా, నాగరాజు కుటుంబ సభ్యులు శవం వద్దే ఆస్తి గొడవకు దిగారు. “ఆస్తుల పంపకాలు జరిగే వరకు లేదా బాండ్ పేపర్ రాసి ఇచ్చి మధ్యవర్తిని చూపిస్తేనే అంత్యక్రియలు చేద్దాం” అంటూ మొండికే శవం వద్దే భీష్మించుకు కూర్చున్నారు.
బలవంతంగా తల్లి శవాన్ని తీసుకెళ్లిన అన్న..
మరోవైపు చిన్నకుమారుడు గోపాల్ తల్లి అంత్యక్రియల కోసం చిన్నశంకరంపేటలోనే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ, పెద్దకుమారుడు నాగరాజు గ్రామం నుండి కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి, బలవంతంగా తల్లి శవాన్ని ఆటోలో బాగిర్తిపల్లికి తరలించాడు. ఈ వివాదం పోలీసుల వరకు వెళ్లగా, అంత్యక్రియలు సొంత గ్రామమైన బాగిర్తిపల్లిలోనే నిర్వహించాలని తేల్చారు. అన్నల నుంచి ప్రాణభయం ఉండటంతో, భయంతో వణికిపోయిన చిన్నకుమారుడు గోపాల్ కన్నతల్లిని కడసారి చూసేందుకు కూడా వెళ్లలేకపోయాడు.
శ్మశానంలో కోడిని పూడ్చి… కన్నీటి వీడ్కోలు
కనిపెంచిన తల్లి శవాన్ని అన్న బలవంతంగా ఎత్తుకెళ్లడంతో చిన్నకుమారుడు గోపాల్ తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. తల్లికి అగ్గిపెట్టే భాగ్యం కూడా లేకపోవడంతో కలత చెందిన అతడు, స్థానిక శ్మశాన వాటికలో ఒక బొంద (గోతిని) తవ్వాడు. సాంప్రదాయాల ప్రకారం కన్నతల్లి ఆత్మకు శాంతి కలగాలని ఒక కోడిని, పూలు, ఇతర పూజా సామాగ్రిని ఆ బొందలో వేసి పూడ్చిపెట్టాడు. కన్నతల్లి శవానికి బదులు కోడిని పూడ్చిపెట్టి ఆచారాలు ముగించాల్సి రావడం అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది.
*మాయమైపోతున్న మానవత్వం*
ఆస్తులు, భూముల కోసం కన్నతల్లి శవాన్ని కూడా వదలకుండా వివాదాలు సృష్టించడం, సాంప్రదాయాలకు విరుద్ధంగా శవం లేకుండానే చిన్నకుమారుడు కోడిని పూడ్చిపెట్టడం చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ముందు కన్నప్రేమ, మానవీయ విలువలు ఎంత చౌకగా మారిపోయాయోనని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
