44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
కంటైనర్ లారీలో అగ్నిప్రమాదం.. 8 కొత్త కార్లు బుగ్గిపాలు
-నాగపూర్ నుంచి కాకినాడ వెళ్తుండగా తూప్రాన్ శివారులో ఘటన
-సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు.. ఫైర్ మెన్లుగా మారిన సీఐ, ఎస్ఐ
-రెండున్నర గంటలపాటు నిలిచిన ట్రాఫిక్.. వాహనాల మళ్లింపు
తూప్రాన్, మే 21 (అశ్వి అప్డేట్స్ )
జాతీయ రహదారి 44పై మిట్టమధ్యాహ్నం వేళ ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర కలకలం రేపాయి. తూప్రాన్ శివారులో ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ లారీలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడంతో, అందులో తరలిస్తున్న రూ. లక్షల విలువైన 8 సరికొత్త మారుతి కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
పోలీసులు మరియు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు ఎనిమిది కొత్త మారుతి కార్లతో ఈ కంటైనర్ వాహనం బయలుదేరింది. అయితే, తూప్రాన్ శివారులోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే కంటైనర్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ నాదీమ్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని హైవే పక్కకు నిలిపివేసి కిందికి దూకడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. కానీ, ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మంటలు కంటైనర్ మొత్తం వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
* ఖాకీ ఫైర్ మెన్స్..*
సమాచారం అందుకున్న వెంటనే తూప్రాన్ సీఐ వెంకట్ రాజ్ గౌడ్, ఎస్ఐ గంగరాజు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఫైర్ ఇంజన్ రావడం కాస్త ఆలస్యం కావడంతో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసు అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బందితో చేతులు కలిపి, ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పేందుకు శ్రమించారు. పోలీసుల సమయస్ఫూర్తిని, సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.
*హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్*
జాతీయ రహదారిపైనే పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు మంటలు ఎగసిపడటంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి, వాహనాలను తూప్రాన్ పట్టణం గుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. అనంతరం హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
