ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణవెల్దుర్తిలో త్రాగు నీటి కష్టాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోనూ బిందెడు నీళ్లే దిక్కు!

వెల్దుర్తిలో త్రాగు నీటి కష్టాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోనూ బిందెడు నీళ్లే దిక్కు!

వెల్దుర్తిలో త్రాగు నీటి కష్టాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోనూ బిందెడు నీళ్లే దిక్కు!

వెల్దుర్తి, మే 22 (ఆశ్వి అప్డేట్స్):

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం ప్రస్తుతం గుక్కెడు నీటి కోసం తీవ్రంగా గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.

*ఒక్క బిందె నీళ్లతో బతుకెలా? కన్నీరు మున్నీరవుతున్న మహిళలు*

కాలనీలో నీటి సమస్య తీవ్రమవ్వడంతో లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తాత్కాలికంగా ఒక ట్యాంకర్‌ను పంపించారు. అయితే వచ్చిన నీటిని ఇళ్లకు ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ సందర్భంగా కాలనీ మహిళలు కన్నీటిపర్యంతమవుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చి కల నెరవేర్చింది నిజమే, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతోంది. ట్యాంకర్ ద్వారా ఇచ్చే ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు మాత్రమే సరిపోతాయి. మరి స్నానాలకు, బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను ఎలా శుభ్రం చేయాలి? రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నాం అని వారు వాపోయారు.

*ఎండల్లో గంటల తరబడి క్యూలు.. వృద్ధుల అవస్థలు*

ఇల్లు కట్టించి ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటే సరిపోదు. నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బతకాలి అంటూ కాలనీవాసులు మండిపడ్డారు. ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోందని, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు.

బోరు వేయకపోతే పంచాయతీ ముట్టడి:గ్రామస్తుల హెచ్చరిక

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో వెంటనే కొత్త బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, శాశ్వత పరిష్కారం చూపే వరకు రోజుకు కనీసం రెండు మూడు ట్యాంకర్ల నీళ్లనైనా పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!