ముత్యాల ‘బెజ్జం’ మురిపెం… మిషన్ల రాకతో కన్నీటి తీరం!
దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘చందంపేట హస్తకళ
ఆధునిక సాంకేతికతతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
సబ్సిడీ మిషన్లతో ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
చిన్న శంకరంపేట,మే22 (ఆశ్వి అప్డేట్స్)
ఆ ఊరి పేరు చెబితే చాలు… ముత్యాల మెరుపులు గుర్తొస్తాయి. ముత్యానికి బెజ్జం వేసి దానికి అసలైన అందాన్ని, విలువను తీసుకురావడంలో ఆ గ్రామస్తులది అందెవేసిన చేయి. అదే మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామం తాతల కాలం నాటి నుంచి ముత్యాలకు రంధ్రాలు చేయడమే ఇక్కడి వందలాది కుటుంబాలకు జీవనాధారం. కానీ, కాలక్రమేణా మారిన సాంకేతికత, ఆధునిక మిషన్ల రాకతో ఆ చేతులు నేడు ఉపాధిని కోల్పోయి దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి.
*దేశాంతరం దాటిన పేట ఖ్యాతి*
ఒకప్పుడు చందంపేట గ్రామం ముత్యాల శుద్ధి, రంధ్రాలు చేయడంలో దేశ నలుమూలలా గుర్తింపు తెచ్చుకుంది. గ్రామంలోని సుమారు 500 మందికి పైగా కార్మికులు నేరుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవించేవారు. అంతేకాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుని ఉపాధి పొందేవారు. ఒకప్పుడు 10 గ్రాముల ముత్యాలకు రంధ్రాలు చేస్తే 30 నుండి 40 రూపాయల దాకా కూలి లభించేది. ఇక్కడ సిద్ధమైన ముత్యాలను హైదరాబాద్‌లో చార్మినార్, ముంబై వంటి మహానగరాలకు భారీగా సరఫరా చేసేవారు.
*మిషన్ల రాకతో మూలనపడ్డ చేతి పరికరాలు*
తరతరాలుగా తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న ఈ కళను నేటి తరం కూడా కొనసాగించాలని ఆశపడింది. కానీ, మార్కెట్లోకి ముత్యాలకు రంధ్రాలు చేసే ఆధునిక మిషన్లు రావడంతో వీరు సాంప్రదాయకంగా వాడే పరికరాలు మూలనపడ్డాయి. చేతిపనితో పోలిస్తే మిషన్ల ద్వారా వేగంగా పని పూర్తి కావడంతో, చందంపేట కార్మికులకు ఆర్డర్లు తగ్గిపోయాయి. ఫలితంగా…దాదాపు 500 మంది ముత్యాల కార్మికులు ఉపాధి కోల్పోయారు.కొందరు భవన నిర్మాణం మేస్త్రీల కింద కూలీలుగా మారగా, మరికొందరు పట్టణాల్లోని దుకాణాలలో తక్కువ జీతాలకు పని చేస్తున్నారు.గంటల తరబడి సూక్ష్మంగా చూస్తూ రంధ్రాలు చేయడం వల్ల చాలామంది కార్మికులు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు.
*కార్మికుల సమస్యలను పరిశీలించిన ఎంపీడీవో* చందంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో దామోదర్ శుక్రవారం పర్యటించారు. ముత్యాల కార్మికులతో నేరుగా మాట్లాడి, వారు ముత్యాలకు రంధ్రాలు చేసే సాంప్రదాయ పరికరాలను, వారి పనితీరును స్వయంగా పరిశీలించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
-ప్రభుత్వమే ఆదుకోవాలి:గరిగే స్వామి (ముత్యాల కార్మికుడు)
తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం మిషన్లు వచ్చాక మా బతుకులు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక పొట్టకూటి కోసం వేరే ఊళ్లకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఈ పని వల్ల కంటిచూపు కూడా మందగిస్తోంది. ప్రభుత్వం స్పందించి, మాకు సబ్సిడీపై ఆధునిక ముత్యాల మిషన్లను అందిస్తే మళ్లీ మా కాళ్ల మీద మేము నిలబడతాం ప్రభుత్వం మమ్మల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలి చందంపేట ముత్యాల కార్మికుల నైపుణ్యానికి మళ్లీ జీవం పోయాలంటే. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయితీలతో కూడిన ఆధునిక యంత్రాలను అందించి, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
