అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. జూలైకి తదుపరి విచారణ
హైదరాబాద్: ‘పుష్ప-2’ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి కోర్టు తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
కోర్టు సమన్లు జారీ చేయడంతో జూన్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌ల కారణంగా హాజరు కాలేకపోయినట్లు సమాచారం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.
ఈ కేసులో ఇతర నిందితులు కోర్టుకు హాజరై బాండ్లపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, విచారణ అనంతరం న్యాయమూర్తి కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు.
2024 డిసెంబర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయగా, అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు.
ఈ కేసు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా, తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
