“భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి”.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 94 ఏళ్ల బామ్మ
బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ తన చివరి రోజులను భారతీయురాలిగానే గడపాలని నిర్ణయించుకుని అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందేందుకు ఆమె జిల్లా కలెక్టర్‌ను కలిసి తన విజ్ఞప్తిని వ్యక్తం చేశారు.
భర్త మరణం అనంతరం తన కుమారుడి వద్దకు అమెరికాలోని వర్జీనియాకు వెళ్లిన మహాలక్ష్మమ్మ, 2000లో అమెరికా పౌరసత్వం పొందారు. దాదాపు 18 సంవత్సరాలు అక్కడ నివసించిన ఆమె, 2018లో తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌ను కలిసిన సందర్భంగా మహాలక్ష్మమ్మ, “నాకు త్వరలో 95 ఏళ్లు పూర్తవుతాయి. నా చివరి రోజులు భారతీయురాలిగానే గడపాలని ఉంది. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలి. ఇప్పటికే అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. వీలైనంత త్వరగా భారత పౌరసత్వం కల్పించండి” అని భావోద్వేగంగా కోరారు.
ఆమె వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్, నిబంధనల ప్రకారం విచారణ పూర్తి చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మమ్మ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మాతృభూమిపై ఆమెకున్న ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
