సిరిసిల్ల సెస్ లైసెన్స్ రద్దు.. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ దుమారం
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) వ్యాపార లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. లైసెన్స్ గడువు ముగిసిన నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించకుండా విద్యుత్ పంపిణీ బాధ్యతలను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో పాటు 2014 నుంచి 2026 వరకు సెస్ పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ నియామకాలు, పాలకవర్గ నిర్ణయాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక విచారణ అధికారిని నియమించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ అంశంపై సెస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణ పూర్తై తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సహకార సంస్థను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నమని ఆరోపిస్తోంది.
అయితే ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ సంస్థ వర్గాలు మాత్రం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంటున్నాయి. సెస్ భవిష్యత్, ఆస్తులు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
