లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. కస్టమ్స్ విచారణకు హాజరైన దుల్కర్ సల్మాన్
కొచ్చి: లగ్జరీ కార్ల అక్రమ దిగుమతి కేసు దర్యాప్తులో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో కొనసాగుతున్న విచారణలో భాగంగా కొచ్చిలోని కస్టమ్స్ కార్యాలయంలో పలుగంటల పాటు ఆయన నుంచి వివరణ తీసుకున్నట్లు సమాచారం.
దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న నాలుగు లగ్జరీ ఎస్‌యూవీలకు సంబంధించి కొనుగోలు విధానం, యాజమాన్య పత్రాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ మాత్రం తాను ఆయా వాహనాలను చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని, అవి భూటాన్ మార్గం ద్వారా అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చినవని తనకు తెలియదని విచారణలో తెలిపినట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా నకిలీ పత్రాలతో లగ్జరీ వాహనాలను దేశంలోకి తీసుకువచ్చి కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఈ కేసులో దుల్కర్ సల్మాన్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. ప్రస్తుతం ఆయన నుంచి సేకరించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ వర్గాలు తెలిపాయి.
