చర్చలకు రాకుండా తప్పించుకున్నారు.. కాంగ్రెస్ మంత్రులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: బహిరంగ చర్చలకు సవాళ్లు విసిరిన కాంగ్రెస్ మంత్రులు చివరకు వెనక్కి తగ్గారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. చర్చకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావు తొలుత తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రకటించి, ఆ తర్వాత గన్‌పార్క్‌కు రావాలని సవాల్ చేశారని పేర్కొన్నారు. అయితే చర్చకు బయలుదేరిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారని, తాను గన్‌పార్క్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినా అనుమతించలేదని ఆరోపించారు.
మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసి, పూలబొకే, శాలువాతో మూడు గంటలపాటు ఎదురుచూశామని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ ఆయన చర్చకు రాలేదని విమర్శించారు. సవాళ్లు విసిరి చివరకు పోలీసులను అడ్డుపెట్టుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులపై కాగ్ గణాంకాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధైర్యముంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, మైక్ కట్ చేయకుండా రెండు గంటల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
అలాగే గురుకుల టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ లేవనెత్తిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమైన హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్లు సహా పలు అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికార పక్షం చర్చల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.
