ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బడి చెట్లకు 'బలిపీఠం'

బడి చెట్లకు ‘బలిపీఠం’

బడి చెట్లకు ‘బలిపీఠం’

-అనుమతుల్లేవు.. లెక్కల్లేవు..

-కలప సొమ్మంతా ఎవరి జేబుల్లోకి

వెబ్ డెస్క్, ఆగస్టు 4 ( ఆశ్వీ అప్డేట్స్ )

నిన్నటి వరకు ఆ పాఠశాల ఆవరణ అంతా పచ్చటి చెట్లతో, పిల్లల కేరింతలతో కళకళలాడేది. ఎండ తీవ్రత నుంచి రక్షణనిచ్చే పచ్చని నీడ, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలినిస్తూ ఆ బడి పిల్లలకు కొండంత అండగా నిలిచాయి ఆ మహా వృక్షాలు. కానీ ఒకే ఒక్క రోజులో కథ మారిపోయింది. చెట్లను కాపాడాల్సిన చోటే కాటేశారు. సెలవులే ఆసరాగా చేసుకుని  గొడ్డళ్లు దిగాయి.. ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలు నేలకూలాయి.

కుకునూరుపల్లి మండల పరిధిలోని ఓ పాఠశాల ఆవరణలో విలువైన చెట్లను నరికేసి, గుట్టుచప్పుడు కాకుండా టింబర్ డిపోకు తరలించి సొమ్ము చేసుకున్న వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

-​అనుమతులు ఏవి? అసలు సూత్రధారి ఎవరు?

సాధారణంగా ప్రభుత్వ ఆస్తి అయిన చెట్లను తొలగించాలంటే అటవీ శాఖ , విద్యా శాఖల నుంచి స్పష్టమైన అనుమతులు ఉండాలి. కానీ ఇక్కడ ఏ నిబంధనలూ పనిచేయలేదు, ఏ అధికారి సంతకమూ పత్రాలపై పడలేదు. అసలు బడి చెట్లను అమ్ముకోవాలనే ప్లాన్ వేసిన ఆ మహానుభావుడు ఎవరు.. నరికిన కలపను డిపోకు తరలించి వచ్చిన సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు గ్రామంలో హల్ చల్ చేస్తున్నాయి.బడిలో పచ్చదనం పెంచాల్సిన బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు, హెచ్‌ఎమ్‌లకు తెలియకుండానే ఈ ఆపరేషన్ జరిగిపోయిందా.. లేక అందరి కళ్లముందే ఈ అక్రమం నడిచిందా..అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే, మరోవైపు బడి అధికారుల కళ్లముందే చెట్లను నరికివేయడంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-​పిల్లలకు నీడ దూరం..

చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. తీవ్రమైన ఎండల్లో ఆడుకోవాలన్నా, కాసేపు నీడన కూర్చోవాలన్నా పిల్లలకు ఆ పచ్చని నీడ ఇక దక్కని పరిస్థితి ఏర్పడింది.చెట్లు కూలాయి.. ప్రశ్నలు మిగిలాయి అన్నట్లుగా తయారైన ఈ దారుణ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తూ చెట్లను నరికి సొమ్ము చేసుకున్న సూత్రధారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!