జహీరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటో ను ఢీ కొట్టిన ట్యాంకర్ .. ఏడుగురు కూలీల మృతి
జహీరాబాద్ ఆగస్టు 11 అశ్వి అప్డేట్స్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్వార్ గ్రామం సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఒక ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పనులు ముగించుకుని తిరిగొస్తుండగా ప్రమాదం
స్థానికుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం రాజగిరి తదితర ప్రాంతాలకు చెందిన పేద కూలీలు రోజూవారీ పనుల నిమిత్తం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. మంగళవారం రోజువారీ పనులు ముగించుకుని వీరంతా ఒకే ఆటోలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో సత్వార్ గ్రామ సమీపానికి చేరుకోగానే వేగంగా వచ్చిన ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవ్వడంతో పాటు, ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
హుటాహుటిన రక్షణ చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే జహీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు, గాయపడిన వారి పూర్తి సమాచారం పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
