అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: దేప భాస్కర్ రెడ్డి
ఆశ్వి అప్డేట్స్ , రంగారెడ్డి జూన్ 27 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు సరికొండ మల్లేష్, అందుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు పొందే యువత పేర్లు నమోదు చేయించడం, చిరునామా మారిన వారి వివరాలను సవరించడం, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర తప్పులను సరిచేయడం వంటి అంశాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని చెప్పారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ అర్హులైన ఒక్కరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా చూడాలని బీఎల్ఏలకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటర్ల జాబితా అత్యంత అవసరమని, అందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాను కచ్చితత్వంతో సిద్ధం చేయడం పార్టీకి ఎంతో కీలకమని పేర్కొన్న ఆయన, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని దేప భాస్కర్ రెడ్డి అన్నారు.
