అభివృద్ధిని అడ్డుకుంటే నేషనల్ హైవేను దిగ్బంధిస్తాం: వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర హెచ్చరిక!
* తూప్రాన్ 6వ వార్డులో రోడ్డు పనులను అడ్డుకోవడం దుర్మార్గం
* కాంగ్రెస్ చేతగాని నాయకత్వంపై గజ్వేల్ బీఆర్ఎస్ ఇంచార్జ్ నిప్పులు
*రెండు రోజుల్లో సీజ్ చేసిన బండ్లను విడుదల చేయకపోతే ప్రజా ఆందోళన తప్పదు
తూప్రాన్, జూన్ 10
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ప్రజల సౌకర్యార్థం జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆరో వార్డులోని రోడ్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.
-హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్.. అడ్డుకున్న కాంగ్రెస్ దద్దమ్మలు:
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఆరో వార్డు కౌన్సిలర్ కాశిరెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, వార్డులో ప్రజలు మరియు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు తన సొంత డబ్బులతో మట్టి పోయిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఎమ్మార్వో, ఆర్డీవోల నుండి ముందస్తు అనుమతులు కూడా తీసుకున్నారని స్పష్టం చేశారు. అయితే, ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ చేతగాని, అసమర్థ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసి, మట్టి టిప్పర్లను సీజ్ చేయించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
అబద్ధాలు, అసత్యాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా.. తూప్రాన్ మున్సిపాలిటీలో తట్టెడు మన్ను కూడా పోయలేదు, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు.” అని ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు.
-పోలీసుల తీరుపై ప్రశ్నల వర్షం:
పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ, సీఐలు వార్డులో పోసిన మట్టిని వచ్చి పరిశీలించాలని ఆయన కోరారు. “ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మట్టి పోశారా? లేక వారి కష్టాలను తొలగించడానికి పోశారా?” అనేది పోలీసులు తేల్చాలన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకుల అధికార దాహానికి లొంగిపోయి, వారి మాటలు విని అక్రమంగా కేసులు పెట్టడం, వాహనాలను సీజ్ చేయడం దారుణమన్నారు. పనికిరాని వెధవలు కంప్లెంట్ ఇస్తే.. పోలీసులు నిజా నిజాలు తెలుసుకోకుండా ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో పోలీసుల పాత్ర కూడా ఉందా అని నిలదీశారు.
-రెండు రోజుల్లో బండ్లు విడుదల చేయకపోతే హైవే దిగ్బంధం:
బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదని, చూస్తూ ఊరుకోదని వంటేరు హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న జేసీబీ, ట్రాక్టర్లు మరియు టిప్పర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వార్డు ప్రజలను సమీకరించి నేషనల్ హైవే 44పై భారీ ధర్నా చేపట్టి, రోడ్డును పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
-18 కోట్ల రూపాయల దొంగ కొబ్బరికాయలు:
మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దొంగల మాదిరిగా గల్లీలలో తిరిగారని.. సీసీ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ. 18 కోట్లు సాంక్షన్ అయ్యాయని, టెండర్లు పిలిచామని అబద్ధాలు చెప్పి కొబ్బరికాయలు కొట్టారని దుయ్యబట్టారు. ఎన్నికలు ముగియగానే ఆ నాయకులు ఎక్కడ దాక్కున్నారని, ఆ రూ. 18 కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోతే, అధికార పార్టీ నాయకులను గల్లీలలో తిరగనివ్వకుండా ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-పదవులు అమ్ముకునే కాంగ్రెస్ నేతలు:
రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజలు ఎవరూ కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని వంటేరు అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదవులను అమ్ముకునే కొంతమంది కాంగ్రెస్ నేతలు.. ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకనే జేసీబీలు, ట్రాక్టర్లపై కేసులు పెట్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మోసపూరిత నాయకులను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి, బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి రఘుపతి, కుమ్మరి రాములు, కృష్ణారెడ్డి, చక్రవర్తి, నాగరాజు, కిష్టారెడ్డి, నరేందర్ రెడ్డి, జయ రాములు, కిషన్, అనిల్, మహమ్మద్, సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
