దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. ‘ఇష్క్ కరో పార్టీ’ ప్రకటించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చర్చనీయాంశంగా మారిన వేళ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
‘ఇష్క్ కరో పార్టీ’ (IKP) పేరుతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన కాట్జూ, ఈ పేరు కేవలం వినోదం కోసం పెట్టలేదని స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, సామాజిక అసమానతలు వంటి సమస్యలపై పోరాడటమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సమాజంలో ప్రేమ, సోదరభావం, సామరస్యం పెంపొందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు.
ఇటీవల సోషల్ మీడియాలో కొత్త తరహా రాజకీయ పార్టీల పేర్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో ‘ఇష్క్ కరో పార్టీ’ కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ పార్టీ భవిష్యత్తులో ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
దేశ ప్రజల సమస్యలను కేంద్రబిందువుగా చేసుకుని రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పార్టీని ప్రారంభించినట్లు జస్టిస్ మార్కండేయ కాట్జూ తెలిపారు.
