హైదరాబాద్: ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ స్పందించారు. ఒక సినిమా టైటిల్‌ను అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదని, తెలుగు భాషలోని ఏ మాండలికాన్నీ కించపరచకూడదని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టులో నరేష్ మాట్లాడుతూ.. తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల మాండలికాలన్నీ తెలుగు భాష సంపదలో భాగమేనని పేర్కొన్నారు. భాషా వైవిధ్యాన్ని విమర్శించే బదులు గౌరవించాలని, ప్రాంతీయ పదాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం తెలుగువారికే నష్టమని అభిప్రాయపడ్డారు.
ఇతర భాషల్లో వచ్చిన ‘కాంతార’, ‘కరుప్పు’ వంటి సినిమాల టైటిళ్ల అర్థం తెలియకపోయినా ప్రేక్షకులు ఆదరించారని గుర్తుచేసిన ఆయన, తెలుగు సినిమాకు ప్రాంతీయ పదాన్ని టైటిల్‌గా పెట్టినందుకు వివాదం సృష్టించడం సమంజసం కాదన్నారు. సినిమాను సినిమాగానే చూడాలని, భాషను రాజకీయాలు లేదా ప్రాంతీయ విభేదాలతో ముడిపెట్టవద్దని సూచించారు.
ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని, తెలుగు భాషా వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు భాషా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు ముందుకు రావాలని నరేష్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
