గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, వినోద్ అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌పై గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్తుండగా, ఎదురుగా రాంగ్ రూట్లో స్కూటీపై వస్తున్న శ్రీకాంత్, విఠల్‌తో ఢీకొన్నాడు. ఢీకొట్టిన తీవ్రతకు స్కూటీపై ఉన్న ఇద్దరూ ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో బుల్లెట్ బైక్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
