తూప్రాన్ గులాబీ గూటిలో కో- ఆప్షన్ ముసలం
హరీష్ వర్సెస్ వంటేరు ధ్రువాలుగా మారిన మున్సిపల్ రాజకీయం
సొంత లాభం ఉంటేనే ఓటు కౌన్సిలర్ల క్యాష్ అల్టిమేటo
చైర్మన్ ఎన్నిక నాటి సీన్ రిపీట్ గజ్వేల్ క్యాంపుకు విపక్ష కౌన్సిలర్లు
డైలమాలో కో ఆప్షన్ ఆశావహులు
ఫామ్ హౌస్ మౌనం పై వీడని సందిగ్ధత
తూప్రాన్ మే 22 (ఆశ్వి అప్డేట్స్)
తూప్రాన్ మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు మరోసారి రోడ్డెక్కాయి. నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం నడిచిన అంతర్గత యుద్ధం చల్లారిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కో ఆప్షన్ పదవుల పంపకం పార్టీలో సరికొత్త భూకంపానికి తెరలేపింది. స్థానిక గులాబీ శ్రేణులు స్పష్టంగా హరీష్ రావు వర్గం ప్రతాప్ రెడ్డి వర్గం గా విడిపోవడంతో తూప్రాన్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎవరి దరి చేరితే పదవి దక్కుతుందో తెలియక కో ఆప్షన్ ఆశావహులు అగమ్య గోచరంలో పడగా కౌన్సిలర్ల భేరసారాలపర్వం పార్టీ పరువును బజారున పడేస్తోంది.
*వంటేరుతో కౌన్సిలర్ల రహస్య భేటీ విపక్షాల ఎంట్రీ తో కలకలం*
తూప్రాన్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా బిఆర్ఎస్ 9 కాంగ్రెస్ 4 బిజెపి మూడు స్థానాలను గెలుచుకున్నాయి. సంఖ్యా బలంపరంగా బీఆర్ఎస్ స్పష్టమైన ఆదిత్యంలో ఉన్నప్పటికీ కౌన్సిలర్ల క్యాంపు రాజకీయం కలకలం రేపుతోంది.
మా వెనక ఉన్న వారికే పదవులు దక్కుతాయి అని హరీష్ రావు అనుచర వర్గం గట్టిగా చెప్తుండగా సంఖ్యాబలం మాకే ఉంది మా మాటే నడుస్తోంది అని వంటేరు వర్గం ప్రతి సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు గజ్వేల్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డిని కలవడం స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా తొమ్మిది మంది కౌన్సిలర్ల గ్రూపులో ఒక కాంగ్రెస్ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా ఉండటం వెనక పెద్ద స్కెచ్ ఉందని అనుమానాలు బలపడుతున్నాయి.
*లక్షలు ఖర్చు పెట్టాం ఊరికే ఓటేయ్యo*
ఈ గ్రూపు తగాదాల మధ్య కొంతమంది కౌన్సిలర్ల సరికొత్త వ్యాపార రాజకీయం ఇప్పుడు అధిష్టానానికి మైండ్ బ్లాక్ చేస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో తాము లక్షలాది రూపాయలు వెచ్చించి చెమటోడ్చి గెలిచామని దాదాపు కౌన్సిలర్ హోదాతో సమానమైన కో ఆప్షన్ పదవులను ఎవరికో ఉచితంగా కట్టబెట్టే ప్రసక్తే లేదని కొంతమంది కౌన్సిలర్లు తెగేసి చెబుతున్నారు సొంత లాభం గట్టిగా ముడితేనే కో ఆప్షన్ అభ్యర్థులకు మద్దతిస్తాం అంతేకానీ పార్టీ విప్ జారీ చేసిన ఉత్తి పుణ్యానికి ఓటు వేసే ప్రసక్తే లేదు అని సదరు కౌన్సిలర్లు లోపాయకారిగా అభ్యర్థులకు అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేసినట్లు బొగట్ట. కాసులు కురిపించే వారికే ఓటన్న సంకేతాలు పంపుతుండడంతో ఆశావహులు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇప్పటివరకు 18 మంది ఆశావహులు కో ఆప్షన్ పదవులకు దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.
*చైర్మన్ ఎన్నిక నాటి రిపీట్ కానుందా..?*
గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలోనూ తూప్రాన్ లో ఇలాంటి ఉత్కంఠ భరిత ఘటనే నడిచింది వంటేరు వర్గం నుండి చెలిమల ప్రియాంక పేరు దాదాపు ఖరారు అయిందని భావించిన చివరి నిమిషంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి దీంతో అలక భూమిన ప్రియాంక ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో బిఆర్ఎస్ ఒకటి వార్డు కౌన్సిలర్ రజిని రవీందర్ గౌడ్ చైర్ పర్సన్ గా మున్సిపల్ పీఠం అధిరోహించారు.మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి కౌన్సిలర్లు బిఆర్ఎస్ లోని ఒక వర్గంతో టచ్ లోకి వెళ్లడం చూస్తుంటే కో ఆప్షన్ ఎన్నికల్లోను పాత సీన్ రిపీట్ కాబోతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
*కెసిఆర్ మౌనం పై బీఆర్ఎస్ శ్రేణుల సందిగ్ధత*
ప్రస్తుతం తూప్రాన్ కో ఆప్షన్ ఆశావహుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడమంటే పాముకు కోపం చందంగా తయారయ్యింది ఏ వర్గానికి జై కొట్టిన ఇంకో వర్గం తొక్కేస్తుందని భయం వెంటాడుతోంది.తూప్రాన్ మున్సిపాలిటీలో పరిస్థితి ఇంతలా దిగజారుతున్న కౌన్సిలర్లు బహిరంగంగానే భేరసారాలకు దిగుతున్న మాజీ ముఖ్యమంత్రి,గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం మౌనం వీడకపోవడం గమనార్హం.అధినేత ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోతే స్థానిక నేతలు మరింత అయోమయంలోకి జారుకునే పరిస్థితులు తలపిస్తున్నాయి.బిఆర్ఎస్ లోని ఈ అంతర్గత విభేదాలను కౌన్సిలర్ల ఆర్థిక ఆశలను ఆసరాగా చేసుకొని విపక్షాలైన కాంగ్రెస్ సందట్లో సడే మియా తరహాలో చక్రం తిప్పేందుకు లోపల వ్యూహాలు రచిస్తున్నాయి. మరి గులాబీ కౌన్సిలర్లు పార్టీ లైన్ కు కట్టుబడి ఓటేస్తారా లేక సొంత లాభం చూసుకొని క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారా అనేది తెలియాలంటే రేపటి వరకు తూప్రాన్ ప్రజానీకం వెయిట్ చేయాల్సిందే…
