దేశంలోనే అత్యుత్తమ ఐసీసీసీ తెలంగాణదే.. మెచ్చుకున్న మేఘాలయ సీఎం సంగ్మా
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) దేశంలోనే అత్యుత్తమ కేంద్రాల్లో ఒకటిగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీని సందర్శించిన ఆయన, అక్కడ అమలు చేస్తున్న అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లు, పరిపాలన విధానాలను పరిశీలించి అభినందనలు తెలిపారు.
ఐసీసీసీలోని టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, వీడియో వాల్, డయల్-112 అత్యవసర స్పందన వ్యవస్థ, సీసీటీవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థల పనితీరును అధికారులు సంగ్మాకు వివరించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న తీరు తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
మేఘాలయలో కూడా తెలంగాణ తరహాలోనే అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని సంగ్మా తెలిపారు. ఇందుకోసం త్వరలోనే అధికారుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు.
తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ కేంద్రం ఆధునిక పోలీసింగ్, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంలో కీలక పాత్ర పోషిస్తోంది.
