*రెవెన్యూ ‘నిర్లక్ష్యపు’ నీడలో ఓ రైతు కుటుంబం*
-వారం రోజులుగా రోడ్డుపైనే దీక్ష.. అధికారుల్లో లేని చలనం
-తూర్పు కనువిప్పు కలుగునా? -అధికారుల తప్పిదానికి సామాన్య రైతు బలి
తూప్రాన్ మే 20
( ఆశ్వి అప్డేట్స్ )
న్యాయం జరగాల్సిన చోట అన్యాయం రాజ్యమేలితే, రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగమే అక్రమార్కులకు కొమ్ముకాస్తే.. ఒక సామాన్య రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో చెప్పడానికి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ రైతు ఏడెల్లి హరిజన నర్సయ్య పోరాటమే నిదర్శనం.తన సొంత భూమిని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న దీక్ష నేటికి వారం రోజులకి చేరుకుంది.
*ఆకాశమే హద్దు.. రోడ్డుపైనే బతుకు*
గత వారం రోజులుగా నరసయ్య కుటుంబం ఇల్లే వాకిలిగా, రోడ్డునే వేదికగా మార్చుకుంది. పొద్దున సూర్యుడి వేడిలో, రాత్రి వేళ ఆరుబయట చలిలో ఆ కుటుంబం దీక్షా శిబిరం వద్దే గడుపుతోంది. చిన్నపిల్లలు, మహిళలతో సహా ఆ కుటుంబం రోజంతా అక్కడే తిండి తిప్పలు మానేసి నిరసన తెలుపుతోంది. కళ్లముందే తమ భూమి పరాయిపాలవుతుంటే చూడలేక, కనీసం అధికారులు వచ్చి పలకరిస్తారన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.
*వారం గడిచినా.. వీడని మొండివైఖరి*
రెవెన్యూ అధికారుల అక్రమ రిజిస్ట్రేషన్ల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నా, తూప్రాన్ రెవెన్యూ యంత్రాంగంలో మాత్రం చలనం లేదు.
సాదాబైనామా దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా పట్టా ఎలా మార్చారు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్ ఎలా పూర్తి చేశారు నోటీసులు ఇవ్వకుండానే రైతు హక్కులను ఎలా కాలరాశారు
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు కనీసం బాధితుడి వద్దకు వచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
*అధికారుల తప్పిదం – రైతుకు శిక్ష*
30 ఏళ్ల క్రితం కష్టపడి కొనుక్కున్న 157/అ సర్వే నెంబర్ లో ఎకరా ఏడు గుంటల భూమి నేడు అధికారుల సంతకాలతో మాయమైపోయింది. నరసయ్య చేసిన తప్పల్లా నమ్మి సాదాబైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడమేనా? అధికారుల పొరపాటు వల్ల ఒక నిరుపేద కుటుంబం ఈరోజు రోడ్డున పడాల్సి వచ్చింది.
మేము పగలు రాత్రి ఇక్కడే పడి ఉంటున్నాం. ప్రాణం పోయినా సరే మా భూమి దక్కే వరకు కదిలేది లేదు. అధికారులకు మా కష్టాలు కనిపించడం లేదా అని నరసయ్య ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నరసయ్యకు న్యాయం చేయాలి. ఒక సామాన్య రైతు కుటుంబం రోడ్డుపై వారం రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకోని అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రైతుకు భూ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది.
