ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణరైతుల జోలికి వస్తే ఖబర్దార్ : కాంగ్రెస్ నేతల వైఖరిపై శంకరాచారి ఫైర్

రైతుల జోలికి వస్తే ఖబర్దార్ : కాంగ్రెస్ నేతల వైఖరిపై శంకరాచారి ఫైర్

రైతుల జోలికి వస్తే ఖబర్దార్

-కాలువ పునరుద్ధరణ మరిచి రైతులపై కేసులా?

-బ్రిడ్జి సమస్యను విస్మరించి పోలీసు జులుం

-రైతులను నిందితులుగా చూపే కుట్రపై ఆగ్రహం

-కాంగ్రెస్ నేతల వైఖరిపై శంకరాచారి ఫైర్

-రైతుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక


చిట్యాల, జూన్ 11 (ఆశ్వి అప్డేట్స్):

రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ఇప్పుడు రాజకీయ కక్షతో అన్నదాతలనే లక్ష్యంగా చేసుకోవడం దారుణమని బీజేపీ సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ పరిధిలోని గాదిరెడ్డిపల్లి-నేరడ గ్రామాలను అనుసంధానించే బ్రిడ్జి నిర్మాణం కోసం రైతులు ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించని ప్రభుత్వం, ఇప్పుడు కాలువ వివాదాన్ని సాకుగా చూపించి రైతులపై అపనిందలు మోపడం దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. రైతులను పోలీస్ స్టేషన్లకు లాగడం, అక్రమ నిర్బంధాలకు పాల్పడడం, బెదిరింపులకు దిగడం ద్వారా రైతాంగాన్ని భయపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే కీలక సమయంలో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించకుండా, వారి సమస్యలను పరిష్కరించకుండా వేధింపులకు గురిచేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు వెచ్చిస్తున్న సమయం, శక్తిని కాలువ పునరుద్ధరణకు వినియోగించి ఉంటే రైతులకు ఎంతగానో ఉపయోగపడేదని శంకరాచారి వ్యాఖ్యానించారు. ఎన్నో సంవత్సరాలుగా రైతుల వ్యవసాయ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసినా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేయడం బాధాకరమన్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాల్సింది పోయి, వారిపైనే నేరారోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనవారే ఇప్పుడు అదే అంశాన్ని అడ్డం పెట్టుకుని రైతులను నిందితులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముందుగా సమస్యను సృష్టించి, తర్వాత అదే నేరాన్ని రైతులపై నెట్టివేసే కుట్రపూరిత రాజకీయాలను రైతాంగం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.

అన్నం పెట్టే రైతునే నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అధికార అహంకారానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రైతులపై బురదజల్లే చర్యలు, పోలీసు జులుం, అక్రమ నిర్బంధాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులు, గౌరవాన్ని కించపరిచే ఏ చర్యనైనా బీజేపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. రైతుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అన్నదాతల ఆత్మగౌరవంతో చెలగాటమాడే వారికి ప్రజాక్షేత్రంలోనే తగిన గుణపాఠం తప్పదని కాసోజు శంకరాచారి ఘాటుగా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!