నేరడ ఆర్తనాదం
-నేరడ-గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి సమస్యతో రైతుల సహనం నశిస్తోంది
-ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
-కాలువ పునరుద్ధరణ పనులు నిలిచిపోవడంతో వ్యవసాయానికి తీవ్ర నష్టం
-సమస్యలు పరిష్కరించాల్సింది పోయి రైతులపై కేసులా అంటూ మండిపాటు
-తెల్లవారుజామున మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై నిరసనల వెల్లువ
-కంప్లైంట్ దారుడి పేరు చెప్పకపోవడంపై రైతుల ఆగ్రహావేశాలు
-సర్పంచ్‌కు సైతం సమాచారం ఇవ్వలేదంటూ పోలీసులపై ఆరోపణలు
-రైతుల సమస్యలపై స్పందించని అధికార యంత్రాంగంపై విమర్శలు
-జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకోవాలని కాసోజు శంకరాచారి డిమాండ్
-ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన రైతులు
-కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్న నేరడ రైతంగం




ఆశ్వి అప్డేట్స్ పొలిటికల్ బ్యూరో జూన్ 11:
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని నేరడ-గాదిరెడ్డి పల్లె గ్రామాల మధ్య నెలకొన్న బ్రిడ్జి నిర్మాణం, కాలువ పునరుద్ధరణ సమస్యలు మరోసారి రైతాంగ ఆవేదనకు కేంద్రబిందువుగా మారాయి. పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రైతులు వ్యవసాయ పనులు నిర్వహించేందుకు నానా అవస్థలు పడుతుంటే, సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రైతుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామున మహిళలను చిట్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించడం, రైతులపై కేసుల నమోదు, కంప్లైంట్ దారుడి వివరాలను గోప్యంగా ఉంచడం వంటి పరిణామాలు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.)


నేరడ-గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య రైతులకు అత్యంత కీలకమైన బ్రిడ్జి నిర్మాణం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ భూములకు చేరుకోవడానికి సరైన మార్గం లేకపోవడంతో రైతులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, పంటల సాగు నుంచి దిగుబడుల తరలింపు వరకు ప్రతి దశలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇదే సమయంలో కాలువ పునరుద్ధరణ పనులు కూడా పూర్తికాకపోవడంతో సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఒకవైపు బ్రిడ్జి లేక రాకపోకలు నిలిచిపోతుంటే, మరోవైపు కాలువలు సక్రమంగా లేక వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా హామీలు తప్ప పనులు ముందుకు కదలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో చిట్యాల పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఆ గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు గోప్యయంగా దాచుతూ చిట్యాల పోలీసులు తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చిట్యాల పోలీసులు తెల్లవారుజామున గ్రామంలోని మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతుల సమస్యలను వినాల్సిన సమయంలో మహిళలను స్టేషన్‌కు తరలించడం మానవత్వానికి విరుద్ధమని గ్రామస్తులు మండిపడుతున్నారు. తాము ఎలాంటి నేరం చేయకపోయినా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, మహిళలు, గ్రామ పెద్దలు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారిపైనే ఒత్తిడి తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. అంతేకాకుండా తమపై కేసులు నమోదు చేసిన వ్యక్తుల వివరాలను వెల్లడించాలంటూ రైతులు పోలీసులను నిలదీశారు. అయితే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పలేమని పోలీసులు చెప్పడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేమిటి న్యాయం..? మాపై కేసులు పెట్టి, ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరన్నది కూడా చెప్పరా?” అంటూ ప్రశ్నించారు. కొంతమంది రైతులు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతూ, “లంచాలు తీసుకొని అరెస్టులు చేస్తే అదే లంచం ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం… కానీ కంప్లైంట్ దారుడి పేరు మాత్రం చెప్పండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో స్పష్టం చేస్తున్నాయి. గ్రామ సర్పంచ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అడిగినా కంప్లైంట్ దారుడి పేరు వెల్లడించలేదని రైతులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై స్పందించిన కాసోజు శంకరాచారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం సరైన విధానం కాదన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం, కాలువ పునరుద్ధరణ పనులను పూర్తి చేయకుండా రైతులను నిందితులుగా చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన అధికారులు ఇప్పుడు ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. చిట్యాల పోలీసుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులపై పూర్తి స్థాయి నివేదిక తీసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం భాజపా సీనియర్ నాయకులు కాసు శంకరాచారి ఆధ్వర్యంలో రైతులతో కలిసి స్థానిక ఎమ్మార్వో విజయ్ కుమార్‌ను కలిసి తమ గోడును వినిపించారు. బ్రిడ్జి నిర్మాణం, కాలువ పునరుద్ధరణ, రైతులపై నమోదైన కేసుల అంశాలను వివరంగా తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మార్వో విజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి, ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయితే రైతులు మాత్రం హామీలతో సరిపెట్టుకునే పరిస్థితిలో లేమని స్పష్టం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా హామీలే వింటున్నామని, ఇప్పుడు పనులు ప్రారంభమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడాలంటే వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి, కాలువ పునరుద్ధరణ చేపట్టి, రైతులపై నమోదైన కేసులను పునఃసమీక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రైతాంగం మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. రైతుల ఇబ్బందులను తొలగించి శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ గళం ఆగదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీస్ ఉన్నత అధికారులను కోరారు. ఈ విషయంలో కలెక్టర్ ను కూడా సంప్రదించి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నేరడ రైతాంగం ఘాటుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, మిర్యాల మురళీకృష్ణ, సాత్విక్, సాయి కుమార్ మర్ల రాజలక్ష్మి, ఆవుల సైదామ్మ, ఆవుల కవిత, ఆవుల ప్రసన్న, వల్లపు పద్మ, వల్లపు సుజాత, కడారి ముత్తమ్మ, కడారి యశోద, మంద యశోద, శీరగోని సలమ్మా,ఆవుల శ్రీను, ఆవుల నర్సింహా, ఆవుల మల్లేష్, మంద వేణుగోపాల్ రెడ్డి, కడారి శంకర్, కడారి శ్రీను, కడారి రాములు, లోడంగి యాదయ, వల్లపు శ్రీశైలం, వల్లపు వెంకన్న, మంద వెంకట్ రెడ్డి,ఉమారెడ్డి, ఆవుల నర్సింహా,తదితరులు పాలొగొన్నారు…
