ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రైస్ మిల్ అప్‌డేట్ కాకపాయే.. రైతులకు డబ్బులు రాకపాయే..

రైస్ మిల్ అప్‌డేట్ కాకపాయే.. రైతులకు డబ్బులు రాకపాయే..

రైస్ మిల్ అప్‌డేట్ కాకపాయే.. రైతులకు డబ్బులు రాకపాయే..!

-వారం దాటినా జమకాని ధాన్యం డబ్బులు

-అక్బరుపేట భూంపల్లి మండలంలో రైతుల ఆందోళన

అక్బరుపేట భూంపల్లి, జూన్ 03, (ఆశ్వి అప్డేట్స్ )

అధికారుల సమన్వయ లోపం, రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వెరసి అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. ధాన్యం అన్‌లోడ్ చేసి వారం రోజులు గడుస్తున్నా.. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాకపోవడంతో చేతికి డబ్బులందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

*ట్రాక్టర్ల నిరాకరణ.. మిల్లు మార్పిడి:*

మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) కేంద్రం నుంచి సేకరించిన ధాన్యాన్ని ఖాజీపూర్ గ్రామంలోని ‘ ఓ రైస్ మిల్లు’కు తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే, సదరు మిల్లు నిర్వాహకులు కేవలం లారీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడానికి నిరాకరించారు. దీంతో రోజుల తరబడి వేచి చూసి విసిగిపోయిన 25 మంది రైతులు, ఐకేపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆ ధాన్యాన్ని సమీపంలోని ‘విజయ గణపతి రైస్ మిల్లు’కు తరలించి అన్‌లోడ్ చేయించారు.సాధారణంగా ధాన్యం అన్‌లోడ్ అయిన 48 గంటల లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. కానీ, విజయ గణపతి రైస్ మిల్లులో ధాన్యం అన్‌లోడ్ చేసి ఏడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. మిల్లు మారిన నేపథ్యంలో ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.

పెట్టిన పెట్టుబడులకు, చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది తక్షణమే స్పందించి, టెక్నికల్ సమస్యలను పరిష్కరించి తమ డబ్బులను త్వరగా ఖాతాల్లో జమ చేయాలని వీరారెడ్డిపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!