వెల్దుర్తి పోలీసుల సింహస్వప్నం -వృద్ధురాలిని దోచిన ముఠా అరెస్ట్
-చాకచక్యంగా కేసును ఛేదించిన సిఐ వెంకట్రాజ గౌడ్ బృందం
తూప్రాన్, జూన్ 05,( అశ్వి అప్డేట్స్ )
అభాగ్యులపై పడి దోచుకునే దొంగల ఆట కట్టించారు వెల్దుర్తి పోలీసులు. ఒంటరి మహిళే లక్ష్యంగా చేసుకొని, కత్తితో బెదిరించి బంగారు కమ్మలు అపహరించిన ఇద్దరు నిందితులను వెల్దుర్తి పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, పక్కా నిఘాతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను జైలు గూటికి చేర్చారు.
ఆటో ఎక్కించి.. అడవిలోకి తీసుకెళ్లి….
మే 30న వెల్దుర్తి మండలం రామాయిపల్లి కి చెందిన రాపర్తి రాజమ్మ (70) వృద్ధురాలు వెల్దుర్తి పరిసర ప్రాంతంలో ఆటో ఎక్కారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఉన్న ఆటో డ్రైవర్లు ఆమెను బస్వాపూర్ గ్రామ శివార్లలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వృద్ధురాలని కత్తితో బెదిరించి, ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల పక్కా ప్లాన్.. బ్రిడ్జి వద్ద దొరికిన దొంగలు
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలోని వెల్దుర్తి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తూప్రాన్ లోని నర్సాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహన తనిఖీలు, నిఘా నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల మార్క్ విచారణతో నిందితులు తలవంచక తప్పలేదు. తామే ఆ వృద్ధురాలిని బెదిరించి బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కృష్ణ జ్యువెలరీ షాపులో విక్రయించి నగదు పంచుకున్నట్లు అంగీకరించారు.నేరానికి ఉపయోగించిన ఆటో ను దొంగిలించిన బంగారు చెవి కమ్మలు కొత్తూరులోని కృష్ణ జ్యువెలరీ షాప్ నుండి రికవరీ చేశారు నిందితులు మద్దూరి శ్రీకాంత్,ఎండి శైలానిల ను రిమాండ్ కు తరలించారు.
ముఖ్య పాత్ర పోషించిన సీఐ వెంకట్రాజా గౌడ్…..
ఈ కేసును ఛేదించడంలో తూప్రాన్ సిఐ ఆశయం వెంకట్రాజా గౌడ్ అత్యంత ప్రతిభను కనబరిచారు. కేసు నమోదైన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి, నిందితుల కదలికలపై నిఘా పెట్టడంలో ఆయన చాకచక్యం, లీడర్‌షిప్ అమోఘం. సిఐ వెంకట్రాజ గౌడ్ పర్యవేక్షణలో వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి, పోలీస్ సిబ్బంది గోవర్ధన్ రావు,కృష్ణ, సురేష్, మహేష్‌లు కృషిచేసి నిందితులను పట్టుకున్నారు.
డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రశంసల జల్లు…..
తక్కువ సమయంలోనే కేసును ఛేదించి, రికవరీ చేసిన తూప్రాన్ సిఐ వెంకట్రాజా గౌడ్ అండ్ టీమ్‌ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన చొరవకు గానూ ఈ బృందానికి త్వరలోనే తగిన రివార్డులు అందజేస్తామని ఆయన ప్రకటించారు. పోలీసుల ఈ మెరుపు దాడిపై స్థానిక ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
