గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి
-ప్రజా పాలనలో ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామ సభలు
– ఎస్.ఐ.ఆర్ పై ప్రజలకు అవగాహన
తూప్రాన్, జూన్ 04, (ఆశ్వి అప్డేట్స్ )
గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం ఘన వ్యర్థాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తూప్రాన్ మండల పరిధిలోని దాతర్‌పల్లి, మల్కాపూర్, ఘణపూర్ గ్రామ పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు.
దాతర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆర్డీవో జయచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇళ్లనుంచే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజల సంపూర్ణ సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
*కేంద్ర ప్రభుత్వ నూతన విధానం ‘ఎస్.ఐ.ఆర్’ పై అవగాహన*
ఈ సందర్భంగా ఆర్డీవో పర్యావరణ అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానం గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు.ఈ విధానం ద్వారా ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడం, మరణించిన వారి పేర్లను తొలగించడం మరియు శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను క్రమబద్ధీకరించడం వంటి ప్రక్రియలు మరింత పారదర్శకంగా మారుతాయని వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ నూతన విధానాన్ని అవగాహన చేసుకుని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికారులకు సహకరించాలని ఆర్డీవో సూచించారు. అలాగే ఘణపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో మండల అభివృద్ధి అధికారి సతీష్ పాల్గొని, ఘన వ్యర్థాల నిర్వహణలో గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కాగా మల్కా పూర్ లో నిర్వహించిన గ్రామ సభకు పంచాయతీ రాజ్ సహాయ ఇంజనీర్ మధుసూదన్ హాజరై గ్రామ స్థాయిలో వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, శాస్త్రీయ పరిశుభ్రత చర్యలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమాలలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు గ్రామ నోడల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు జయరామ్ , పంజాల ఆంజనేయులు గౌడ్, వెంకటేష్ తో పాటు దాతర్ పల్లి ఉపసర్పంచ్ ప్రవీణ్, వార్డ్ మెంబర్లు పిట్ల వెంకటేష్, చింతల సంతోష, చింతల లక్ష్మి తో పాటు కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, కుమ్మరి స్వామి,అశోక్, చింతల శ్రీనివాస్,పుట్నాల గణేష్, శంకర్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
