సలాహ్ మ్యాజిక్.. 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఈజిప్ట్
వాంకోవర్: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈజిప్ట్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో ఘన విజయం సాధించిన ఈజిప్ట్, ప్రపంచకప్ చరిత్రలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో 92 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరపడింది.
గ్రూప్-జీ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి అర్ధభాగంలో ఫిన్ సుర్మన్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో ఈజిప్ట్ అద్భుతంగా పుంజుకుంది. మోస్తఫా జికో సమం చేసే గోల్ సాధించగా, ఆ తర్వాత స్టార్ ఆటగాడు మహ్మద్ సలాహ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. అనంతరం ట్రెజెగెట్ మరో గోల్ నమోదు చేసి విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఒక గోల్, ఒక అసిస్ట్‌తో మెరిసిన సలాహ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్-జీలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తదుపరి మ్యాచ్‌లో ఇరాన్‌తో తలపడనుంది.
1934లో తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఈజిప్ట్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. తాజాగా న్యూజిలాండ్‌పై సాధించిన గెలుపుతో ఆ చెడు రికార్డుకు ముగింపు పలికి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
