- -రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వైనం
-విల్లాలు ఇవ్వకపోతే ‘మీ పని చేస్తా
-మేడ్చల్ లో సీఎం నకిలీ పీఏ గుట్టురట్టు
మేడ్చల్ మే 19 అశ్వి అప్డేట్స్ :”నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏని.. పీసీసీ సభ్యుడిని.. నాతో పెట్టుకుంటే మీ పని ఖల్లాస్” అంటూ సీఎం, మంత్రుల పేర్లు చెప్పుకుని వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక పెద్ద కేటుగాడి ఆట కట్టించారు మేడ్చల్ పోలీసులు. భూ సమస్యలు సెటిల్ చేస్తానంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఐదు విల్లాలను డిమాండ్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ గుప్తా అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
మీడియా సమావేశంలో ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారులు తొక్కాడు. ఈ క్రమంలోనే మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్‌లో ‘ఆర్.ఆర్ రియల్ ఎస్టేట్’ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి, తాను సీఎం రేవంత్ రెడ్డి పీఏని, పీసీసీ సభ్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు.
సదరు వ్యాపారికి సంబంధించిన భూ సమస్యలను తానే దగ్గరుండి సెటిల్ చేస్తానని నమ్మబలికాడు. అందుకు ప్రతిఫలంగా తనకు ఐదు విల్లాలను విక్రయించి, ఆ నగదును అప్పగించాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ వచ్చి కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, “మీ పని చేస్తా” అంటూ సదరు వ్యాపారిని తీవ్రంగా బెదిరించాడు.
పోలీసుల నిఘా.. నిందితుడు అరెస్ట్
బాధితుడు భయపడకుండా వెంటనే సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా ఉంచి, అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో సంతోష్ గుప్తా కేవలం ఇక్కడే కాకుండా, గతంలోనూ పలుచోట్ల సీఎం, మంత్రుల పేర్లను వాడుకుంటూ వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తేలింది.
దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి నకిలీ వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
