తూప్రాన్‌ను ముంచెత్తిన అకాల వర్షం:
-అతలాకుతలమైన గ్రామాలు.. -కన్నీరుమున్నీరవుతున్న రైతన్న!
తూప్రాన్, మే 27 (ఆశ్వీ అప్డేట్స్ )
తూప్రాన్ మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఈదురుగాలులతో కూడిన భారీ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని పలు గ్రామాలు ఈ వర్షం ధాటికి అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఘనపూర్, గుండ్రెడ్డిపల్లి , మల్కాపూర్, వెంకటరత్నాపూర్, దాతర్ పల్లి, కిష్టాపూర్, ఇస్లాంపూర్ గ్రామాల్లో వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ వైర్లు తెగిపడటంతో గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రాత్రి వేళల్లో ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
-ఐకేపీ సెంటర్లలో తడిసి ముద్దయిన ‘బంగారు పంట’
ఈ అకాల వర్షం రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ, పీఏసీఎస్) రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం కుండపోత వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది.కొన్నిచోట్ల అధికారులు తూకం (కాంటా) వేసినప్పటికీ, సకాలంలో లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం బస్తాలు కల్లాల్లోనే ఉండిపోయి నీటిపాలయ్యాయి. తూప్రాన్ మండలంలోని ఆయా సెంటర్లలో సుమారు 30 వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయినట్లుగా తెలుస్తుంది.ప్రభుత్వం ఒకవైపు తేమ శాతం కచ్చితంగా ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయాలని ఐకేపీ సీసీలను, పీఏసీఎస్ అధికారులను కఠినంగా ఆదేశించింది. అయితే, ఇప్పుడు పడిన వర్షానికి ధాన్యంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల అధికారులు కొనుగోలు నిలిపివేస్తారేమోనని, తూకం వేసిన ధాన్యానికి తరుగు తీస్తారేమోనని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెలల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట, చేతికొచ్చే సమయానికి కళ్లముందే నీటిపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కల్లాల్లో వరద నీరు చేరి ధాన్యం కొట్టుకుపోకుండా అడ్డుకునేందుకు తడిసిన తార్పాలిన్లతో రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి.కూలిన పాత ఇండ్లు..
-అంధకారంలో గ్రామాలు
వర్షం ధాటికి గ్రామాల్లోని పాత ఇండ్లు, మట్టి గోడలు కూలిపోయాయి. చాలా ఇండ్ల లోపలికి వర్షపు నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయి, ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఘనాపూర్ గ్రామంలోని ఒక నివాస గృహంలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడమే కాకుండా, మురుగు కాలువలు పొంగిపొర్లడంతో రహదారులు చెరువులను తలపించాయి.
-రంగంలోకి దిగిన ఘనపూర్ సర్పంచ్.. ప్రశంసనీయ సేవలు
ఘనపూర్ గ్రామంలో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. విద్యుత్ తీగలపై కూడా చెట్లు విరిగిపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఘనపూర్ గ్రామ సర్పంచ్ సబ్బని వెంకటేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, వానలో తడుస్తూనే సర్పంచ్ వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగారు. రహదారిపై పడిన చెట్లను, విద్యుత్ తీగలపై విరిగిపడిన కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధిగా ఆయన చూపిన చొరవను, సేవా నిరతిని గ్రామ ప్రజలు మరియు ప్రయాణికులు ఎంతగానో అభినందిస్తున్నారు.
-తక్షణమే ఆదుకోవాలని డిమాండ్
అకాల వర్షం వల్ల ఇండ్లు కోల్పోయిన పేదలకు తక్షణ నివాస, భోజన వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు (తేమ శాతం వంకలు) పెట్టకుండా, తరుగు తీయకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని తూప్రాన్ మండల రైతాంగం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
