ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తూప్రాన్‌లో ఖాకీ నిద్ర.. దొంగల జాతర!

తూప్రాన్‌లో ఖాకీ నిద్ర.. దొంగల జాతర!

తూప్రాన్‌లో ఖాకీ నిద్ర.. దొంగల జాతర!

-పట్టణ నడిబొడ్డున ‘సైరన్’ పెట్రోలింగ్ ఉత్తుత్తిదేనా?

-నిమిష నిమిషానికి తిరిగే పోలీసు వాహనాలు

-సాయిరాం ట్రేడర్స్‌లో రూ. 50 వేల నగదు, విత్తనాలు అపహరణ

-మూడు రోజుల క్రితమే ఆలయాల్లో విధ్వంసం, దొంగతనాలు,దొంగలను పట్టుకున్నది పోలీసులా? ప్రజలా?

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్న తూప్రాన్ పోలీసులు

తూప్రాన్ జూన్ 3( ఆశ్వి అప్డేట్స్ )

తూప్రాన్ పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా గాల్లో దీపంగా మారాయి. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా రెచ్చిపోతుంటే.. పోలీసులు మాత్రం ‘అంతా సవ్యంగానే ఉంది’ అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళల్లో నిమిష నిమిషానికి సైరన్లు వేస్తూ తిరిగే పోలీసు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ సిబ్బంది కేవలం నామమాత్రపు షోకేస్‌కే పరిమితమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు, ఆలయాలపై దాడులు పోలీసుల నిఘా వైఫల్యాన్ని, తీవ్ర నిర్లక్ష్యాన్ని చాటిచెబుతున్నాయి.

*నడిబొడ్డున.. హైవే పక్కనే.. నిమిష నిమిషానికి పెట్రోలింగ్ ఉన్నా చోరీ*

తాజాగా సోమవారం అర్ధరాత్రి పట్టణ నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ‘సాయిరాం ట్రేడర్స్’ ఫర్టిలైజర్ షాపులో దొంగలు భారీ స్కెచ్ వేశారు. దుకాణ యాజమాని బొల్లు రమేష్ రాత్రి షాపు మూసి వెళ్లిన తర్వాత.. అర్ధరాత్రి వేళ దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లో ఉన్న రూ. 50 వేల నగదుతో పాటు, విలువైన విత్తనాలను కూడా మోసుకెళ్లారు.ఈ రూట్‌లో ప్రతి నిమిషానికి పోలీసు వాహనాలు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి. మరి అంతటి కట్టుదిట్టమైన నిఘా కళ్లెదుటే.. ప్రధాన రహదారిపై అంత నింపాదిగా షాపు తాళాలు పగలగొట్టి, బరువైన విత్తన బస్తాలను తరలిస్తుంటే పెట్రోలింగ్ సిబ్బంది ఏం చేస్తున్నట్లు? నిద్రపోతున్నారా? లేక అటువైపు కన్నెత్తి చూడటం లేదా? అని వ్యాపారవర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. దొంగతనం జరిగిన దృశ్యాలన్నీ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

-ఆలయాల్లో విధ్వంసం.. పోలీసుల కంటే ప్రజలే మేలు!

తూప్రాన్ పోలీసుల వైఫల్యం ఈ ఒక్క ఘటనతోనే ఆగలేదు. గడచిన మూడు రోజుల క్రితమే పట్టణంలోని చారిత్రాత్మక, పురాతన శ్రీ కూర్మ నారసింహస్వామి దేవస్థానంలో దొంగలు చొరబడి ఏకంగా విగ్రహాలనే ధ్వంసం చేశారు. అటుపై పెద్దమ్మ తల్లి దేవాలయంలోనూ చొరబడి విలువైన వస్తు సామాగ్రిని అపహరించారు.ఇక్కడ విచిత్రం మరియు సిగ్గుచేటైన విషయం ఏంటంటే… నిఘా పెట్టాల్సిన పోలీసులు దొంగలను పట్టుకోలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలే ఆ దొంగలను వెంటాడి, వేటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ప్రజలు దొంగలను పట్టుకుని ఇస్తే.. తాము కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు గొప్పలు చెప్పుకోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

* ఖాకీల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం*

పోలీసుల నిరంతర గస్తీ ఉంటే దొంగలకు ఇంత ధైర్యం ఎలా వస్తుంది? గుడులను ధ్వంసం చేసినా పోలీసుల్లో చలనం రాలేదు. ఇప్పుడు పట్టణ నడిబొడ్డున షాపులు దోచుకెళ్తున్నారు. అసలు తూప్రాన్‌లో సామాన్యుడికి, వ్యాపారులకు రక్షణ ఉందా?” అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరుస దొంగతనాలతో తూప్రాన్ ప్రజలు రాత్రి పూట నిద్రపోవాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా తూప్రాన్ పోలీసులు ఏసీ గదులు, వాహనాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో నిజాయితీగా పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ ఫుటేజ్ ఆధారంగా సాయిరాం ట్రేడర్స్ దొంగలను త్వరితగతిన పట్టుకుని శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!