విజయ్ దేవరకొండపై తప్పుడు ప్రచారం.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన ‘రణబాలి’ నిర్మాతలు
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రంగా ఖండించింది. విజయ్ దేవరకొండ షూటింగ్ కోసం 5–6 కారవాన్లు, 40–50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ స్పందిస్తూ, విజయ్ దేవరకొండ ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని, షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్లు, కథనాలు నకిలీవని, వాటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయ్ దేవరకొండ బృందం కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, కావాలనే దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ పోస్టులు, ఫేక్ స్క్రీన్‌షాట్లను షేర్ చేసే వారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
