టీటీడీకి రిలయన్స్ భారీ కానుక.. రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులు అందజేయనున్న అనంత్ అంబానీ
తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని టీటీడీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. తిరుమలలో భక్తుల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, బస్సుల విరాళంతో పాటు వాటిని నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా సంస్థ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, స్వామివారిని దర్శించుకున్న అనంతరం సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదం, శేషవస్త్రంతో సత్కరించారు.
ఈ విరాళం ద్వారా తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, రోజూ లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
