ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం తక్కువ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే దిగువకు చేరింది. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి ధరలు పడిపోవడం గమనార్హం.
అయితే ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశాలు కనిపించడం లేదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల సమయంలో చమురు మార్కెటింగ్ సంస్థలు ఎదుర్కొన్న నష్టాలను ముందుగా భర్తీ చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు.
చమురు ధరల తగ్గుదలతో దేశ దిగుమతి వ్యయం తగ్గడం, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కొంత మేర తగ్గడం వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ, వినియోగదారులకు తక్షణ ధరల ఉపశమనం లభిస్తుందా అనే విషయంలో స్పష్టత లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దిగుమతి వ్యయం, పన్నులు, ఇతర ఆర్థిక అంశాలను సమీక్షించిన అనంతరమే ఇంధన ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
