తెలంగాణ భవన్ వద్ద హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురుకుల టెండర్ల వివాదంతో ఉద్రిక్తత
హైదరాబాద్: గురుకుల టెండర్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు గన్‌పార్క్‌కు బయలుదేరిన సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, హరీశ్‌రావు కిందపడిపోయినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.
పోలీసుల చర్యకు నిరసనగా హరీశ్‌రావు, పార్టీ నాయకులు తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
గురుకుల టెండర్ల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై ప్రభుత్వం, బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
