క్యాబినెట్ భేటీకి కొండా సురేఖ గైర్హాజరు.. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై అసంతృప్తి?
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న అసంతృప్తితోనే ఆమె క్యాబినెట్ భేటీకి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కథనం ప్రకారం, లండన్ పర్యటన నుంచి తిరిగివచ్చిన అనంతరం యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయం తెలుసుకున్న కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు తెలియకుండానే కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆమె సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తన నిర్ణయాలకు ప్రాధాన్యం లేని పరిస్థితుల్లో కొనసాగడం కష్టమని, ఇక భరించే ఓపిక లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు కథనంలో పేర్కొన్నారు. పలువురు మంత్రులు ఫోన్ చేసి క్యాబినెట్ సమావేశానికి రావాలని కోరినప్పటికీ ఆమె హాజరుకాలేదని సమాచారం.
ఇప్పటికే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, తాజాగా కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలతో అధికార పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ మరింత ముదిరినట్లు తెలుస్తోంది.
అయితే, క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరైన కారణాలపై కొండా సురేఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
